Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో ...రెండు వర్గాల మధ్య ఘర్షణకు కారణమైన సిగరెట్ వివాదం!
- సిగరెట్‌కు డబ్బులు ఇవ్వక పోవడంతో గొడవకు బీజం
- షాపు యజమానిపై దాడితో ఇరువర్గాల మధ్య ఘర్షణ
- ఇద్దరు పోలీసులతో సహా పది మందికి గాయాలు
సిగరెట్ డబ్బుల విషయమై ప్రారంభమైన మాటామాటా రెండు వర్గాల మధ్య పెద్ద గొడవగా మారి ఘర్షణకు దారితీసిన ఘటనలో పది మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉండడం గమనార్హం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కేతిపురా గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ప్రధాన బాధితుడు రాంపాల్ కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి. రాంపాల్‌కు గ్రామంలో చిన్న పాన్‌షాపు ఉంది. ఆదివారం అతని దుకాణానికి వచ్చిన ఇమ్రాన్ అనే యువకుడు సిగరెట్ తీసుకున్నాడు. డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయాడు. సోమవారం మళ్లీ దుకాణం వద్దకు వచ్చిన ఇమ్రాన్‌ను డబ్బుల విషయమై రాంపాల్ అడిగాడు.
ఈ సందర్భంగా ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది. కోపోద్రిక్తుడైన ఇమ్రాన్ రాంపాల్‌పై దాడిచేశాడు. అడ్డు వచ్చిన అతని కుటుంబ సభ్యులపైనా దాడికి దిగాడు. ఈ గొడవ విషయం గ్రామస్థులకు తెలియడంతో పెద్దదయ్యింది. రాంపాల్, ఇమ్రాన్ వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులకు పాల్పడ్డారు. రాళ్లు, ఇటుకలు రువ్వుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టే క్రమంలో వారిపై కూడా కొందరు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో కానిస్టేబుళ్లు మనోజ్, రాహుల్‌తో పాటు ఇరువర్గాలకు చెందిన మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 89 మందిపై కేసు నమోదు చేశామని, ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.