Andhra Pradesh: ఆ ఒక్క మాట చెప్పాలని మోదీని కోరాను.. కుదరదని ముఖం మీదే చెప్పేశారు!: చంద్రబాబు ఆవేదన

  • రైతులు కరెంట్ కోతలతో అల్లాడారు
  • అనంతలో కరవు విలయతాండవం చేసింది
  • రైతులను ఆదుకునేందుకే రుణమాఫీ

ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం అందించిన సాయం, క్షేత్రస్థాయిలో వాస్తవాలను  ప్రజలకు వెల్లడించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో వ్యవసాయ రంగంపై ఏపీ సీఎం శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. వ్యవసాయ రంగం ఎంత అభివృద్ధి అయితే అంత ఎక్కువగా కొనుగోలు శక్తి పెరుగుతుందని చంద్రబాబు తెలిపారు. మిగతా రంగాలు కూడా దీనివల్ల అభివృద్ధి అవుతాయని వెల్లడించారు. 2014లో ఏపీలో ఆత్మహత్యలు, కరెంట్ కోతలతో రైతులు అల్లాడేవారనీ, చివరికి కోనసీమ వాసులు కూడా ఇబ్బంది పడ్డారని గుర్తుచేశారు. ఈరోజు అమరావతిలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు.

గత 20 ఏళ్లలో 16 సంవత్సరాలు అనంతపురం జిల్లాలో కరవు విలయతాండవం చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఏపీలో డెల్టా ప్రాంతానికి నీళ్లు ఆలస్యంగా వదిలేవారనీ, తీరా పంటలు కోతకు వచ్చేసరికి తుపానులు వచ్చి పంట మొత్తం నాశనమయ్యేదని వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘మోదీ గారూ.. మేం రైతులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పాం. మీరూ ఓ మాట చెప్పండి’ అని తాను కోరాననీ, ఇందుకు ప్రతిగా ‘నేను చెప్పను. ఒకవేళ ఇక్కడ చెబితే దేశమంతా అమలు చేయాల్సి ఉంటుంది’ అని మొహం మీదే చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా ఏపీకి వస్తున్న నిధులను కూడా అడ్డుకున్నారనీ, రుణాలను ఇవ్వొద్దని బ్యాంకులను ఆదేశించారని గుర్తుచేసుకున్నారు. రైతన్నల సమస్యలను పరిష్కరించడానికి రూ.లక్ష రుణమాఫీ చేశామన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ మాత్రమే ఈ రకంగా రూ.లక్ష రుణమాఫీ చేయగలిగిందని వ్యాఖ్యానించారు. వీటిలోనూ రూ.50 వేలు ఒకేసారి మాఫీ చేశామని తెలిపారు. రైతులకు ఈ సందర్భంగా 10 శాతం వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. ఇలా ఇప్పటివరకూ 24,000 కోట్లకు పైగా నిధులను వెచ్చించామని వెల్లడించారు. దీనివల్ల రైతుల్లో నమ్మకం వచ్చిందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఇంకో రూ.5000 కోట్లు ఇస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని అన్నారు.

  • Loading...

More Telugu News