Andhra Pradesh: ఏ రైతూ డబ్బుల కోసం ఆత్మహత్య చేసుకోడు.. తెలంగాణ కంటే ఏపీలో రైతుల ఆత్మహత్యలు చాలా తక్కువ!: చంద్రబాబు
- సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించాం
- వర్షం తక్కువగా పడ్డా తట్టుకోగలిగాం
- ఉద్యానవన పంటలు, ఆక్వా ద్వారా రైతన్నలకు ఉపాధి
ఆంధ్రప్రదేశ్ లో రైతన్నల సమస్యలు తీర్చడానికి సాగునీటి ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి సారించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీలో 17 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తికాగా, మరో ఆరు ప్రాజెక్టులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తిచేసినా పట్టిసీమను నిర్మించకుంటే ప్రయోజనం ఉండేదే కాదని వెల్లడించారు. పట్టిసీమతో పాటు నదుల అనుసంధానం కారణంగానే ఈసారి వర్షం తక్కువగా పడినా తట్టుకోగలిగామని పేర్కొన్నారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన ప్రజావేదికలో ఏపీలో వ్యవసాయం రంగంపై శ్వేతపత్రాన్ని చంద్రబాబు విడుదల చేశారు.
ఈరోజు ప్రపంచంలో ఆహార అలవాట్లు మారాయనీ, అందుకు అనుగుణంగా ఏపీలో వ్యవసాయం తీరును మార్చామని చంద్రబాబు తెలిపారు. సంప్రదాయ వ్యవసాయంతో పాటు రొయ్యలు, చేపల పెంపకం, ఉద్యానవన పంటలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని వెల్లడించారు. తద్వారా దేశంలోనే అగ్రస్థానంలో ఏపీని నిలబెట్టామన్నారు. ఏపీలో భూసారం పెంచడంతో పాటు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను రైతులకు అందించామని చెప్పారు.
మహారాష్ట్ర, తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటే ఏపీలో గణనీయంగా తగ్గాయని చంద్రబాబు పేర్కొన్నారు. రైతన్నలు ప్రాణాలు తీసుకుంటే ఆ కుటుంబానికి రూ.5 లక్షలు ఇచ్చి ఆదుకుంటున్నామని అన్నారు. ఏ రైతు కూడా డబ్బుల కోసం ఆత్మహత్యలు చేసుకోడని వ్యాఖ్యానించారు. ఏపీలో ఈసారి దాదాపు 400 మంది రైతులు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారనీ, ఈ సంఖ్య తెలంగాణలో దాదాపు 4,500, మహారాష్ట్రలో 3,500గా ఉందని చెప్పారు.