Andhra Pradesh: ఏపీలో మోదీ పర్యటన తగదు.. ఈ నెల 28న కరవు బంద్ నిర్వహిస్తాం: సీపీఐ రామకృష్ణ
- ఏపీకి ఇచ్చిన హామీలను మోదీ నెరవేర్చలేదు
- మోదీ పర్యటనను నిరసిస్తున్నాం
- ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై ఢిల్లీలో నిరసిస్తాం
ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చని ప్రధాని మోదీ ఈ రాష్ట్రంలో పర్యటించనుండటం తగదని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. విజయవాడలో తొమ్మిది వామపక్ష పార్టీల నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన రామకృష్ణ మాట్లాడుతూ, మోదీ రాకను నిరసిస్తూ ఈ నెల 28న కరవు బంద్ నిర్వహించనున్నట్టు చెప్పారు.
ఏపీలో జనవరి 6న మోదీ పర్యటించనున్నారని ఆరోజున రాష్ట్ర వ్యాప్తంగా ‘మోదీ గో బ్యాక్’ అంటూ నిరసన తెలియజేస్తామని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ జనవరి 4న ఢిల్లీలో నిరసన తెలియజేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏపీలో ఇటీవల సంభవించిన తుపాన్ కారణంగా ప్రజలు ఇబ్బందిపడ్డారని, కరవుతో ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు. కరవు ప్రాంతాల వారికి ప్రభుత్వం సాయం ప్రకటించడం లేదని విమర్శించారు.