Baba Ram dev: 2019 తర్వాత ప్రధాని ఎవరన్న దానిపై యోగా గురు బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు
- ప్రస్తుత రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి
- ఈ దేశాన్ని మతతత్వ దేశంగా చూడాలనుకోవడం లేదు
- రామ మందిరం నిర్మించకుంటే బీజేపీని నమ్మరు
వచ్చే ఎన్నికల తర్వాత ప్రధాని ఎవరు కావొచ్చన్న దానిపై ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఈ విషయం చెప్పడం కష్టమని పేర్కొన్నారు. భారతదేశాన్ని హిందూ దేశంగానో, లేదంటే మతతత్వ దేశంగానో చూడాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. తమకు ఎలాంటి రాజకీయ, మతతత్వ ఎజెండా లేదని స్పష్టం చేశారు. తాము ఆధ్యాత్మిక భారతదేశాన్ని, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని మాత్రమే కోరుకుంటున్నట్టు చెప్పారు.
ఇచ్చిన హామీ ప్రకారం అయోధ్యలో రామమందిరం నిర్మించకపోతే బీజేపీ విశ్వసనీయత కోల్పోవడం ఖాయమన్నారు. బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా వ్యాఖ్యలపై బాబా రాందేవ్ స్పందిస్తూ.. భారత్‌ను మతపరమైన అసహన దేశంగా చిత్రీకరిస్తూ, దేశ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం కొందరు చేస్తున్నారని మండిపడ్డారు.