Train 18: దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలు ఇదే.. వీడియో షేర్ చేసిన రైల్వే మంత్రి గోయల్
- గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్న ట్రైన్ 18
- వంద కోట్లతో దేశీయంగా అభివృద్ధి
- ఈ నెల 29 నుంచి పరుగులు
ట్రైన్-18.. దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలుగా రికార్డులకు ఎక్కనుంది. దేశంలోని తొలి ఇంజిన్ లెస్ రైలుగా ఖ్యాతికెక్కనున్న ఈ రైలు దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలు అని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు రైలు ట్రయల్ రన్ సందర్భంగా తీసిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ‘‘నీడ్ ఫర్ స్పీడ్’’ అంటూ ట్వీట్ చేసిన మంత్రి.. ట్రైన్-18 గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టు పేర్కొన్నారు. దేశంలోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనన్నారు.
దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ ఇంజిన్ లేని రైలులో 16 ఏసీ కోచ్‌లు ఉంటాయి. ఇప్పటి వరకు ఫాస్టెస్ట్ రైళ్లగా రికార్డులకెక్కిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వేగాన్ని ఇది అధిగమించనుంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు వేగం గంటకు 155 కిలోమీటర్లు. ఈ రైలుతో పోలిస్తే ప్రయాణ వేగాన్ని 15 శాతం తగ్గిస్తుంది. 'మేకిన్ ఇండియా'లో భాగంగా ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 100 కోట్ల రూపాయల ఖర్చుతో కేవలం 18 నెలల్లోనే ఈ రైలును నిర్మించారు. పలుమార్లు నిర్వహించిన ట్రయల్ రన్స్‌ను విజయవంతంగా పూర్తిచేసిన ట్రైన్-18ను ఈ నెల 29న ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. న్యూఢిల్లీ-వారణాసి, హబీబ్‌గంజ్-న్యూఢిల్లీ, లక్నో-న్యూఢిల్లీ, న్యూఢిల్లీ-కల్కా, న్యూఢిల్లీ-అమృత్సర్, అహ్మదాబాద్-ముంబై రూట్లలో ఈ రైలు ప్రయాణించనుంది.