Andhra Pradesh: హోదా కోసం ఢిల్లీలో వైసీపీ పోరాటం.. నేడు ‘వంచనపై గర్జన’ దీక్ష!
- జంతర్ మంతర్ వద్ద ఉదయం 10 గంటలకు ప్రారంభం
- ఢిల్లీకి భారీగా చేరుకున్న వైసీపీ నేతలు, శ్రేణులు
- కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకేనంటున్న వైసీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వేదికగా పోరాటానికి విపక్ష వైసీపీ సిద్ధమయింది. దేశరాజధానిలో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ‘వంచనపై గర్జన’ దీక్షను నిర్వహించనుంది. ఢిల్లీ నడిబొడ్డున ఉన్న జంతర్ మంతర్ ప్రాంతం ఈ కార్యక్రమానికి వేదిక కానుంది. వంచనపై గర్జన దీక్షలో పాల్గొనేందుకు వైసీపీ పార్లమెంటు సభ్యులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.
పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ప్రత్యేకహోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్న పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకే వంచనపై గర్జన దీక్ష నిర్వహిస్తున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు. గత నాలుగున్నరేళ్లుగా హోదా కోసం వైసీపీ ఉద్యమిస్తూనే ఉందని పేర్కొన్నారు. కేంద్ర వైఖరికి నిరసనగా ఈ ఏడాది ఏప్రిల్ 6న వైసీపీ లోక్ సభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసిన విషయాన్ని వారు గుర్తుచేశారు.
అంతేకాకుండా ప్రజలను జాగృతం చేసేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 29న విశాఖపట్నంలో తొలిసారి వంచనపై గర్జన దీక్ష నిర్వహించామన్నారు. అనంతరం నెల్లూరు జిల్లాలో జూన్ 2న, అనంతపురంలో జూన్ 3న, గుంటూరులో ఆగస్టు 9న, కాకినాడలో నవంబర్ 30న వంచనపై గర్జన దీక్షలను చేపట్టినట్లు తెలిపారు.