YSRCP: పునాదుల పేరిట ఎంతకాలమీ మోసం?: చంద్రబాబుపై వైకాపా విమర్శలు
- తాత్కాలిక భవనాలు తప్ప శాశ్వత భవనాలేవి
- చంద్రబాబు మరో మోసపు నాటకం
- ఢిల్లీలో వైకాపా మాజీ ఎంపీ వరప్రసాద్
అమరావతిలో ఇంతవరకూ తాత్కాలిక భవనాలే తప్ప, ఒక్క శాశ్వత భవనాన్ని కూడా నిర్మించని చంద్రబాబునాయుడు, పునాదుల పేరిట మరో మోసపు నాటకానికి తెరలేపారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ వరప్రసాద్ మండిపడ్డారు. ఈ ఉదయం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైకాపా తలపెట్టిన 'వంచనపై గర్జన దీక్ష'లో పాల్గొని ప్రసంగించారు. అన్నింటికి కేవలం పునాది మాత్రమే వేసి ప్రజలను నమ్మించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
బీజేపీతో కలసి చంద్రబాబు, ఏపీని ఎలా మోసం చేశారో చెప్పేందుకే ఈ దీక్షను చేపట్టామని ఆయన తెలిపారు. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయించుకునే స్థితిలో లేని చంద్రబాబు ఓ అసమర్దుడిగా నిలిచిపోయారని నిప్పులు చెరిగారు. బీజేపీతో కలిసున్నంతకాలం కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడని చంద్రబాబు, ఇప్పుడు పునాది రాయిని చూపించి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వరప్రసాద్ విమర్శలు గుప్పించారు. హోదాపై ఆది నుంచి పోరాడుతున్నది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని, తాము రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచామని గుర్తు చేశారు.