Andhra Pradesh: జగన్ కు చెప్పీచెప్పీ అలసిపోయా.. ఆ తర్వాతే వైసీపీ నుంచి బయటకు వచ్చా!: మంత్రి ఆదినారాయణ రెడ్డి
- ఫ్యాక్టరీకి ప్రైవేటు భూములపై జగన్ కొర్రీలు
- ఢిల్లీలో మొండి దీక్షలు చేస్తున్నారు
- స్టీల్ ప్లాంట్ కు ఆయన అడ్డుపుల్లలు వేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన కడప స్టీల్ ఫ్యాక్టరీ ఆషామాషీ వ్యవహారం కాదని ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తెలిపారు. గతంలో ఇక్కడ బ్రాహ్మిణి స్టీల్ ఫ్యాక్టరీని పెట్టేందుకు ప్రయత్నించారనీ, అప్పుడు బ్యాంకు నుంచి భారీ లోన్లు తీసుకుని ప్రతిపక్ష నేత జగన్, ఇంకొక మనిషి పంచుకున్నారని ఆరోపించారు. కడప జిల్లా కంబాల దిన్నెలో స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన పనులకు చంద్రబాబు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం మూడు వేల ఎకరాలు ఉన్నాయని తెలిపారు.
అదనంగా కావాల్సిన ప్రైవేటు భూములను సమీకరించకుండా జగన్ అడ్డుపడ్డారని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అయితే, జగన్ అడ్డుపుల్లలు వేయడానికి బ్రాండ్ అంబాసిడర్ గా తయారయ్యారని దుయ్యబట్టారు. ఇప్పుడు కూడా ఇంత గొప్ప కార్యక్రమం కడపలో జరుగుతుంటే ఢిల్లీలో జగన్ మొండి దీక్షలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పక్కనే ఉండి చెప్పీ చెప్పీ అలసిపోయానని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తాను వైసీపీ నుంచి బయటకు రాగా, తాను డబ్బులకు అమ్ముడుపోయినట్లు వైసీపీ నేతలు ప్రచారం చేశారన్నారు. వైజాగ్ లో జగన్ కు చిన్నగాటు తగిలితే, కత్తిపోటు అంటూ వైసీపీ నేతలు రాష్ట్రపతి వరకూ పోయారనీ, తనపై ఫిర్యాదు చేశారని తెలిపారు.