Andhra Pradesh: బీసీ నేతలపై మంత్రి ఆది నారాయణ రెడ్డి గుస్సా.. నేతల చుట్టూ తిరగడం మాని ప్రజల్లోకి వెళ్లాలని తలంటు!
- ప్రొద్దుటూరు టికెట్ బీసీలకు ఇవ్వాలని విన్నపం
- టికెట్ ఇచ్చేది ముఖ్యమంత్రే అన్న మంత్రి ఆది
- ప్రజల్లోకి వెళ్లి బలం నిరూపించుకోవాలని సూచన
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీసీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు ప్రొద్దుటూరు టికెట్ కేటాయించాలని కోరారు. దీంతో మంత్రి తీవ్రంగా స్పందిస్తూ.. పార్టీ టికెట్ కోసం నేతల చుట్టూ తిరగవద్దని సూచించారు. ప్రజల మధ్య ఉండి బలం నిరూపించుకోవాలనీ, అప్పుడు సాక్షాత్తూ పార్టీ అధినేత చంద్రబాబే స్వయంగా పిలిచి టికెట్ ఇస్తారని తలంటారు.
బీసీ నేతలు బొర్రా రామాంజనేయులు, సందు శివనారాయణ, పాణ్యం సుబ్బరాయుడులు, పల్లా శేషయ్య, కృష్ణయ్యయాదవ్, డీఈ వెంకటసుబ్బయ్య, మేకల సుబ్బరామయ్య తదితరులు మంత్రిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రొద్దుటూరు టికెట్ కోసం ఇద్దరు నేతలు బరిలో ఉన్నారనీ, పార్టీలోని వారిని కాదని బయటివారికి ఇవ్వడం సాధ్యం కాదని కుండబద్దలు కొట్టారు. టికెట్ కావాలంటే బలం నిరూపించుకునే విధంగా పనిచేయాలని సూచించారు. అంతేతప్ప నేతల చుట్టూ తిరిగితే ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.