loksabha: లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ.. విపక్షాల ఆందోళన!
- బిల్లు పట్ల కేంద్రం తీరుపై విపక్షాల నిరసన
- సభలో గందరగోళ పరిస్థితులు
- చర్చకు సహకరించాలని కోరిన మంత్రి రవిశంకర్ ప్రసాద్
ట్రిపుల్ తలాక్ బిల్లు ఏ వర్గానికి వ్యతిరేకం కాదని, ఈ బిల్లు ద్వారా ముస్లిం మహిళలకు రక్షణ కలుగుతుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై లోక్ సభలో ఈరోజు వాడీవేడీ చర్చ కొనసాగుతోంది. ఈ బిల్లు పట్ల కేంద్రం తీరును నిరసిస్తూ సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో, సభలో గందరగోళ పరిస్థితులు తలెత్తడంతో బిల్లుపై చర్చకు సహకరించాలని సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు.
ఈ సందర్భంగా రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, బిల్లులో ఏవైనా అభ్యంతరాలు ఉంటే పరిశీలిస్తామని, పలు దేశాలు ఈ ఆచారాన్ని రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ, ట్రిపుల్ తలాక్ బిల్లుపై కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉందని, దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపాలని విజ్ఞప్తి చేశారు.