Anupriya Patel: బీజేపీ తీరుపై విరుచుకుపడిన కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ
- చిన్న పార్టీలకు గౌరవం ఇవ్వట్లేదు
- పార్టీ వైఖరి పట్ల నిబద్ధతతో ఉంటా
- ఎస్పీ-బీఎస్పీల పొత్తు పెను సవాలుగా మారింది
ఇటీవలే ఆర్ఎస్ఎల్పీ చీఫ్, కేంద్రమంత్రి ఉపేంద్ర కుశ్వాహ బీజేపీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఎన్డీయేలోని మరో కేంద్ర సహాయమంత్రి బీజేపీ వైఖరిని తప్పుబడుతూ సంచలనం సృష్టించారు. కేంద్ర సహాయమంత్రి, అప్నాదళ్ నేత అనుప్రియా పటేల్ బీజేపీ చిన్న పార్టీలకు తగిన గౌరవం ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల ఎదుర్కొన్న పరాజయాల నుంచి బీజేపీ పాఠాలు నేర్చుకోవాలని.. ఎస్పీ-బీఎస్పీల పొత్తు తమకు పెనుసవాలుగా మారిందని అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వెల్లడించిన పార్టీ వైఖరి పట్ల నిబద్ధతతో ఉంటానని అనుప్రియ తెలిపారు. ఇప్పటికే అనుప్రియ భర్త, అప్నాదళ్ అధినేత ఆశిష్ పటేల్ బీజేపీ తమకు తగిన ప్రాధాన్యమివ్వట్లేదని.. ఎస్పీ-బీఎస్పీ కూటమి కారణంగా యూపీలో ఎన్డీయేకు కష్టాలు తప్పవని వ్యాఖ్యానించడం జరిగింది. తాజాగా అనుప్రియ వ్యాఖ్యలతో బీజేపీ, అప్నాదళ్ పార్టీల మధ్య బేధాభిప్రాయాలు తలెత్తాయన్న వ్యాఖ్యలకు బలం చేకూరినట్టైంది.