Jammu And Kashmir: పండంటి పాపాయికి జన్మనిచ్చిన 65 ఏళ్ల బామ్మ.. వైద్య చరిత్రలో అరుదైన ఘటన
- రికార్డులకెక్కనున్న బామ్మ
- ఇప్పటికే ఆమెకు 11 ఏళ్ల కుమారుడు
- జమ్ముకశ్మీర్లో ఘటన
జమ్ముకశ్మీర్లో అద్భుతం జరిగింది. 65 ఏళ్ల బామ్మ పండంటి పాపాయికి జన్మనిచ్చి సరికొత్త చరిత్ర సృష్టించింది. సదరు మహిళ (పేరు వెల్లడించలేదు) భర్త హకీం దిన్ వయసు 80 ఏళ్లు కావడం గమనార్హం. పూంచ్ జిల్లా ఆసుపత్రిలో ఆమెకు డెలివరీ చేసిన వైద్యులు మాట్లాడుతూ.. ఇది వైద్య చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటన అని తెలిపారు. నిజానికి రుతు క్రమం నిలిచిపోయిన తర్వాత గర్భం దాల్చే అవకాశాలు ఉండవన్నారు. 65 ఏళ్ల బామ్మకు ఇప్పటికే పదకొండేళ్ల కుమారుడు ఉండగా, ఇది రెండో కాన్పు.
కాగా, అత్యంత లేటు వయసులో బిడ్డకు జన్మనిచ్చిన మహిళగా స్పెయిన్కు చెందిన 66 ఏళ్ల మారియా డెల్ కార్మెన్ బౌసదా దెలారా రికార్డులకెక్కింది. అయితే, ఆమె సహజ సిద్ధంగా కాకుండా, ఐవీఎఫ్ విధానంలో గర్భం దాల్చి జన్మనిచ్చింది. తాజాగా, జమ్ముకశ్మీర్ మహిళ మాత్రం సహజ సిద్ధంగా బిడ్డకు జన్మనిచ్చింది. కాబట్టి ఆమె పేరు ప్రపంచ రికార్డులకెక్కనుంది.