Cable Operators: కేబుల్ టీవీ ఆపరేటర్ల ఆందోళన.. రేపు వార్తా ఛానళ్లు మాత్రమే వస్తాయి!
- ఉదయం 10 - రాత్రి 8 వరకూ ప్రసారాల నిలిపివేత
- ట్రాయ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన
- 400 ఛానళ్లను 200-250కే అందిస్తున్నాం
వీకెండ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ చూస్తూ ఆనందించే ప్రేక్షకులకు కేబుల్ ఆపరేటర్లు షాక్ ఇచ్చారు. రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వార్తా ఛానళ్లు మినహా మిగిలిన చానల్స్ ను నిలిపివేస్తామని వెల్లడించారు. ట్రాయ్ ప్రకటించిన కొత్త టారిఫ్‌ను వ్యతిరేకిస్తూ ఒక్కరోజు ఆందోళనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేబుల్ ఆపరేటర్లు తెలిపారు. మరోవైపు కొత్త టారిఫ్ అమలుకు ట్రాయ్ జనవరి 31, 2019ని డెడ్‌లైన్‌గా విధించింది.
ఈ అంశంపై ఏపీ రాష్ట్ర కేబుల్ ఆపరేటర్ వెల్‌ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ట్రాయ్ నిర్ణయం వల్ల వినియోగదారులు రూ.400 - 450 కేబుల్ బిల్లు కట్టాల్సి ఉంటుందన్నారు. తాము 400 ఛానల్స్‌ను రూ.200 - 250 ఛార్జ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరి గౌడ్ లింగాల మాట్లాడుతూ.. ట్రాయ్ డెడ్‌లైన్‌ను పొడిగించడం కాదని.. వెనక్కి తీసుకునే వరకూ తమ పోరాటం ఆగదన్నారు.