Pakistan: హైదరాబాద్‌లో ఉగ్ర కలకలం.. పాక్ ఉగ్రవాదులతో మాట్లాడుతున్న దినేశ్ అరెస్ట్
- నల్లకుంట కేంద్రంగా సైన్యం కదలికలపై ఆరా
- అనుమానించిన అధికారులు
- రెండు రోజుల నిఘా అనంతరం నిందితుడి పట్టివేత
హైదరాబాద్ కేంద్రంగా ఓ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ నుంచి జరుగుతున్న ఉగ్ర కార్యకలాపాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీవోఐపీ) ద్వారా జమ్ముకశ్మీర్, పాకిస్థాన్‌లోని ఐసిస్ ఉగ్రవాదులతో రహస్యంగా సంభాషిస్తున్న దినేశ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తమ మాటలను ఎవరూ గుర్తుపట్టకుండా దినేశ్ ప్రత్యేకంగా ఓ పరికరాన్ని తయారుచేసినట్టు పోలీసులు గుర్తించారు. అతడి నుంచి ఆ పరికరంతోపాటు రెండు సిమ్ బాక్స్‌లు, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.
జమ్ముకశ్మీర్‌లోని భారత సైన్యం కదలికలు తెలుసుకునేందుకు పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు పన్నాగం పన్నినట్టు భారత నిఘా విభాగం గుర్తించింది. ఈ ఫోన్ వ్యవస్థ ద్వారా, సైన్యంలో ఉన్నతాధికారులమని చెబుతూ సైనికాధికారుల రహస్య సమాచారాన్ని ఐఎస్ఐ ఏజంట్లు అడుగుతుండడంతో అనుమానం రావడంతో ఇద్దరు అధికారులు ఈ విషయాన్ని సైన్యంలోని నిఘా విభాగానికి చేరవేశారు. ఫోన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆరా తీయగా హైదరాబాద్‌లోని ఓ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ నుంచి వస్తున్నట్టు గుర్తించారు. వారిచ్చిన సమాచారం మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), తెలంగాణ పోలీసులు రెండు రోజులు నిఘా పెట్టి నల్లకుంట టీఆర్టీ కాలనీలో నివసిస్తున్న దినేశ్‌ను అరెస్ట్ చేశారు.