south central railway: సికింద్రాబాద్ నుంచి నడిచే 31 డెమూ రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
- జనవరి 1 నుంచి మార్చి 31 వరకు అమలు
- ప్లాట్ఫాం విస్తరణ పనుల కారణంగా నిర్ణయం
- ఎంఎంటీఎస్ సర్వీసులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పలు ప్రాంతాలకు తిరిగే మొత్తం 31 డెమూ (డీజిల్-ఎక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఇది పిడుగులాంటి వార్త. రైల్వే స్టేషన్లో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ప్రధానంగా ప్లాట్ఫాం విస్తరణ, పాదచారుల వంతెన పనులు పూర్తిచేసేందుకు ట్రాఫిక్ రద్దీని తగ్గించాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో సికింద్రాబాద్-బొల్లారం-మేడ్చల్-మనోహరాబాద్ సెక్షన్లో నడుస్తున్న మొత్తం 31 రైళ్లను జనవరి ఒకటో తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు తెలియజేసింది. సికింద్రాబాద్ ఫలక్నుమా మధ్య ఎంఎంటీఎస్ రైళ్లు తిరుగుతున్నాయని, ప్రత్యామ్నాయంగా ఈ సర్వీసులను ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించింది.