kcr: ప్రాంతీయ పార్టీలను అయోమయంలో పడేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు!: చంద్రబాబు
- బీజేపీతో కేసీఆర్ కు రహస్య ఒప్పందాలున్నాయనే అనుమానాలున్నాయి
- ప్రాంతీయ పార్టీలను కేసీఆర్ అయోమయంలో పడేస్తున్నారు
- బీజేపీ, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు కష్టమనే విషయం కేసీఆర్ కు తెలుసు
బీజేపీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రహస్య ఒప్పందాలు ఉన్నాయనే అనుమానాలు అందరిలో ఉన్నాయని... ఆయన ఫెడరల్ ఫ్రంట్ లో ఎవరూ చేరరని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీకి అనుకూలంగా ప్రాంతీయ పార్టీలను అయోమయంలో పడేసేందుకు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ యత్నిస్తున్నారని చెప్పారు. ఎకనామిక్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, బీజేపీకి వ్యతిరేకంగా పని చేసే కూటమిలో కేసీఆర్ తో పాటు పని చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ లో చేరాలని కేసీఆర్ కు తాను చెప్పానని... దానికి ఆయన తిరస్కరించారని అన్నారు.
జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమిని ఏర్పాటు చేయడం కష్టమనే విషయం కేసీఆర్ కు కూడా తెలుసని చంద్రబాబు అన్నారు. శివసేన, అకాళీదళ్, నితీష్ కుమార్ పార్టీలు కాంగ్రెస్ ఫ్రంట్ లో చేరవని... మిగిలిన పార్టీలు చేరే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం తటస్థంగా ఉన్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ లో చేరే అవకాశం ఉందని తెలిపారు. మాయావతి, అఖిలేష్ యాదవ్ లు బీజేపీని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.