Chandrababu: ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతాం!: సీఎం చంద్రబాబు

  • గ్రీన్‌ అండ్‌ బ్లూ సిటీగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడి
  • పౌరవిమానయానం, ఆర్‌అండ్‌బీ, ఫైబర్‌ గ్రిడ్‌ తదితరాలపై శ్వేతపత్రం విడుదల
  • ఆర్థిక నగరాలను అభివృద్ధి చేస్తున్నామన్న ముఖ్యమంత్రి

ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. వరల్డ్‌ టాప్‌-5లో అమరావతి ఉండాలన్నది తన లక్ష్యమని చెప్పారు. పౌర విమానయానం, రోడ్లు భవనాలు, ఫైబర్‌గ్రిడ్‌, ఆర్థిక నగరాలు, గ్యాస్‌, తీరప్రాంతం అభివృద్ధి వంటి అంశాలపై శనివారం ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రీన్‌ అండ్‌ బ్లూ సిటీగా అమరావతిని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఆర్థిక నగరాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోందని, ఇందుకోసం జక్కంపూడిని ఓ నమూనాగా తీసుకున్నట్లు వెల్లడించారు.

2015లో పౌర విమానయాన విధానాన్ని అమల్లోకి తెచ్చి విమానాశ్రయాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం విలువైన భూములు కూడా ఆయా ఎయిర్‌ పోర్టులకు దఖలు పర్చినట్లు వివరించారు. రాష్ట్రంలో విమాన ప్రయాణికుల సంఖ్య 55 లక్షలకు చేరిందని వెల్లడించారు. ప్రతి జిల్లాలో పౌర విమానయానాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్రం ఓ వైపు కృషి చేస్తున్నా అభివృద్ధి, సేవల విషయంలో కేంద్రం మోకాలడ్డుతోందని విమర్శించారు. తిరుపతి, విజయవాడ నుంచి విదేశాలకు విమాన సర్వీసులు ప్రారంభించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం కేంద్రం తీరువల్లే ముందుకు వెళ్లలేదని చెప్పారు.

జల రవాణాలోనూ అద్భుతమైన ప్రగతి సాధించినట్లు తెలిపారు. ఓడల ద్వారా సరుకు రవాణాలో 117 మిలియన్‌ల యూనిట్ల నుంచి 173 మిలియన్‌ల యూనిట్లకు చేరినట్లు తెలిపారు. కాకినాడ, మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం ఓడరేవులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. విశాఖపట్నం, కాకినాడ, జగ్గయ్యపేట, విజయవాడల్లో జల రవాణా కేంద్రాలను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

పైప్‌లైన్ల ద్వారా నేరుగా ఇళ్లకే గ్యాస్ సరఫరా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని  వివరించారు. ఇది అమల్లోకి వస్తే 30 శాతం గ్యాస్ అదనంగా సరఫరాకు వీలు కలుగుతుందని తెలిపారు. టవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, ఇంటింటికీ ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందజేస్తున్నట్లు సీఎం వెల్లడించారు.

  • Loading...

More Telugu News