kcr: మరో మహా యాగానికి సిద్ధమైన కేసీఆర్.. తేదీలు ఖరారు
- మహారుద్ర సహిత సహస్ర చండీ మహా యాగాన్ని నిర్వహించనున్న కేసీఆర్
- ఎర్రవెల్లి ఫాంహౌస్ లో జనవరి 21 నుంచి 25 వరకు యాగం
- పాల్గొననున్న 200 మంది రుత్విక్కులు
ప్రజాసంక్షేమం, ఎన్నికల్లో గెలుపు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెలలో రాజశ్యామల యాగాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో మహా యాగానికి ఆయన సిద్ధమయ్యారు. లోకకల్యాణం, రాష్ట్ర అభివృద్ధి కోసం 'మహారుద్ర సహిత సహస్ర చండీ మహా యాగం'ను ఆయన నిర్వహించబోతున్నారు. ఎర్రవల్లిలో ఉన్న తన ఫాంహౌస్ లో ఈ యాగాన్ని నిర్వహించనున్నారు. జనవరి 21 నుంచి 25 వరకు యాగాన్ని నిర్వహిస్తారు. గతంలో నిర్వహించిన అయుత చండీ మహా యాగం తరహాలోనే... ఈసారి కూడా శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థ స్వామి ఆశీస్సులతో, శృంగేరి శారదాపీఠం సంప్రదాయంలోనే ఈ మహాయాగాన్ని నిర్వహించనున్నారు.
మాణిక్య సోమయాజి, నరేంద్ర కాప్రే, ఫణిశశాంక శర్మ, పురాణం మహేశ్వర శర్మ తదితరుల ఆధ్వర్యంలో ఈ యాగం జరగనుంది. ఇందులో 200 మంది రుత్విక్కులు పాల్గొననున్నారు. యాగ నిర్వహణకు సంబంధించి మాణిక్య సోమయాజితో నిన్న కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. మరోవైపు, ఈ యాగానికి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి వచ్చే అవకాశం ఉంది.