India: ఇక్కడితో ఆగబోము: విరాట్ కోహ్లీ
- సిడ్నీ టెస్టులోనూ సత్తా చాటతాం
- బుమ్రా బౌలింగ్ అద్భుతం
- ప్రజెంటేషన్ సందర్భంగా కోహ్లీ
తమ విజయ ప్రస్థానాన్ని ఇక్కడితో ఆపబోమని, వచ్చే సంవత్సరం మొదట్లో సిడ్నీలో జరిగే నాలుగో టెస్టులోనూ విజయం సాధిస్తామని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. మెల్ బోర్న్ లో మూడో టెస్ట్ ప్రజెంటేషన్ సందర్భంగా కోహ్లీ మాట్లాడాడు. ఈ విజయంతో తమకెంతో నమ్మకం ఏర్పడిందని, బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ లోనూ ఆటగాళ్లు చక్కగా రాణించారని అన్నారు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ తమ వద్దే ఉండనుందని గుర్తు చేసుకున్న విరాట్, సౌతాఫ్రికాతో విజయం తరువాత, ఆస్ట్రేలియాకు వచ్చామని, ఇక్కడ కూడా రాణిస్తామన్న నమ్మకముందని చెప్పాడు.
ఆటగాళ్లపై, వారి ఆటతీరుపై వచ్చే కామెంట్లు, విశ్లేషణలను తాను పట్టించుకోబోనని, తన టీమ్ మరింత బాగా ఆడాలని కోరుకుంటానని అన్నారు. ఈ మ్యాచ్ విజయం బౌలర్లదేనని, బుమ్రా అద్భుతంగా రాణించి, కీలక సమయాల్లో వికెట్లను పడగొట్టి, జట్టును గెలుపు దిశగా పరిగెత్తించాడని అన్నాడు. ఇక్కడ టెస్ట్ సిరీస్ ను గెలుచుకుని వెళ్లే తొలి భారత కెప్టెన్ మీరే అవుతారా? అన్న ప్రశ్నకు, నిజంగా తన వద్ద జవాబు లేదని, తుది టెస్టును కూడా గెలవడమే లక్ష్యంగా ఆడతానని చెప్పాడు.