Indian Railways: రైళ్లలో పెరగనున్న కోటా... మహిళలకు మరిన్ని లోయర్ బెర్తులు!

  • మహిళలు, వయో వృద్ధుల కోటా పెంపు
  • ఈ సంవత్సరం ఎన్నో మైలురాళ్లు నమోదు చేసిన రైల్వేస్
  • వెల్లడించిన పీయుష్ గోయల్

రైళ్లలో మహిళలు, వృద్ధులకు ఇచ్చే లోయర్ బెర్తుల కోటాను మరింతగా పెంచాలని ఇండియన్ రైల్వేస్ నిర్ణయించింది. శనివారం నాడు సమావేశమైన రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు 45 సంవత్సరాలు పైబడిన మహిళలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులకు ఇచ్చే కోటాను పెంచాలని నిర్ణయించారు.

ప్రస్తుతం సాధారణ రైళ్లలోని స్లీపర్ క్లాసుల్లో 6, సెకండ్, థర్డ్ ఏసీ బోగీల్లో మూడు, దురంతో రైళ్లలో కోచ్ కి మూడేసి చొప్పున కోటా ఉండేది. సవరించిన కోటా ప్రకారం, ఒకే స్లీపర్ కోచ్ ఉన్న రైళ్లలో ఏడు సీట్లు వీరికి కేటాయిస్తారు. సాధారణ ఎక్స్ ప్రెస్ రైళ్ల ఏసీ కోచ్ లలో 4, రాజధాని, దురంతో రైళ్లలో 5 సీట్లు కేటాయిస్తారు. ఒకే సెకండ్ ఏసీ కోచ్ ఉండే రైళ్లలో నాలుగు బెర్త్ లు మహిళలు, వృద్ధులకు కేటాయిస్తారు.

కాగా, ఈ సంవత్సరం భారతీయ రైల్వే వ్యవస్థలో ఎన్నో మైలురాళ్లు నమోదయ్యాయని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరంలోనే ఇండియాలో అత్యంత వేగంగా పరిగెత్తే రైలు పట్టాలెక్కిందని, అత్యంత పొడవైన రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ నిర్మించామని ఆయన గుర్తు చేశారు. తొలి ట్రాన్స్ పోర్ట్ యూనివర్శిటీ, తొలి ఏసీ లోకల్ రైలు వచ్చాయని అన్నారు. గడచిన మూడు దశాబ్దాల వ్యవధిలో అతి తక్కువ ప్రమాదాలు జరిగింది ఈ సంవత్సరమేనని గుర్తు చేశారు. గడచిన నాలుగున్నరేళ్ల ఎన్డీయే పాలనలో రైల్వేల్లో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామని పీయుష్ గోయల్ తెలిపారు.

  • Loading...

More Telugu News