Andhra Pradesh: అగ్రిగోల్డ్ ఆందోళనకారులతో ఏపీ ప్రభుత్వ చర్చలు సఫలం.. చెల్లింపులు మొదలుపెట్టనున్న ప్రభుత్వం!
- జనవరి చివరి నుంచి చెల్లింపునకు అంగీకారం
- హాయ్ లాండ్ కొనుగోలుదారులకు రాయితీలు
- మీడియాకు వివరాలు వెల్లడించిన మంత్రి కాల్వ
అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నేతలు ముప్పాళ్ల వెంకటేశ్వరరావు, విశ్వేశ్వరరెడ్డితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో వీరంతా ఈరోజు ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆందోళనకారులను పరామర్శించారు. అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపు ప్రక్రియను వెంటనే ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది.
ఈ విషయమై మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ.. జనవరి నెలాఖరు నుంచి అగ్రిగోల్డ్ చెల్లింపు ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. చిన్న మొత్తాల బాండ్లను తొలుత చెల్లిస్తామనీ, రూ.5 వేల బాండ్ల నుంచి దశలవారీగా మిగిలినవాటిని అందజేస్తామని వెల్లడించారు.
ఈ విషయమై జనవరి 12న కోర్టులో అఫిడవిట్ సైతం దాఖలు చేస్తామని పేర్కొంది. ఈ సందర్భంగా నోటిఫై చేయని ఆస్తులను జనవరి చివరిలోగా వేలం వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. హాయ్ ల్యాండ్ ఆస్తులను కొనేందుకు ముందుకొచ్చేవారికి రాయితీలు ఇస్తామని ప్రకటించారు.