Andhra Pradesh: టీటీడీ కీలక నిర్ణయం.. రేపు, ఎల్లుండి శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు!
- ప్రత్యేక దర్శనాలను నిలిపివేసిన ఆలయ వర్గాలు
- భక్తులు భారీగా వస్తున్న నేపథ్యంలో నిర్ణయం
- వీఐపీలకు మాత్రమే ప్రొటోకాల్
న్యూ ఇయర్ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్ 31తో పాటు జనవరి 1న శ్రీ వేంకటేశ్వరస్వామికి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దుచేస్తున్నట్లు తెలిపింది. నూతన సంవత్సరం నేపథ్యంలో భక్తులు స్వామివారి దర్శనానికి భారీగా పోటెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో టీటీడీ ఈ మేరకు స్పందించింది.
అలాగే ఈరోజు అర్ధరాత్రి నుంచి కాలినడకన వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లను, వృద్ధులు, దివ్యాంగులు,దాతలకు ప్రత్యేక దర్శనాలను కూడా రద్దుచేస్తున్నామని టీటీడీ వెల్లడించింది. రద్దీ నేపథ్యంలో జనవరి 6 వరకూ సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తేల్చిచెప్పింది. ప్రొటోకాల్ ను కేవలం ప్రముఖులకే వర్తింపజేస్తామని పేర్కొంది. 2019, జనవరి 2 నుంచి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.