Odisha: పూజారిపై పోలీసు దాడి...12 గంటలు మూతపడిన పూరీ జగన్నాథుని ఆలయం
- ఆందోళనకు దిగిన పూజారులు
- గర్భాలయానికి తాళం వేసి నిరసన
- ఓ విదేశీ భక్తుడిని స్వామి దర్శనానికి తీసుకువెళ్తుండగా వివాదం
ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథుని ఆలయం పన్నెండు గంటలపాటు మూతపడింది. ఆలయ పూజారుల్లో ఒకరిపై విధుల్లో ఉన్న పోలీసు దాడి చేయడంతో వివాదం నెలకొంది. నిత్యం వేలాది మంది భక్తులు స్వామి దర్శనానికి వచ్చే ఆలయం గర్భగుడికి తాళం వేసి ఉండడంతో ఇబ్బందులు పడ్డారు. వివరాల్లోకి వెళితే...గురువారం సాయంత్రం ఆలయ పూజారుల్లో ఒకరు ఒక విదేశీ భక్తుడిని స్వామి వారి దర్శనానికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అతను విదేశీ భక్తుడన్న ఉద్దేశంతో పూజారిని అడ్డుకున్నాడు.
ఈ సందర్భంగా ఇద్దరి మధ్యా వాగ్వాదం జరగగా పూజారిపై పోలీసు దాడిచేశాడు. ఈ చర్యను నిరసిస్తూ ఆలయంలోని పూజారులంతా ఆందోళనకు దిగారు. వెంటనే గర్భాలయానికి తాళం వేసి ఆందోళనచేపట్టారు. ఇంత జరిగినా అధికారులు కిమ్మనక పోవడంతో దాదాపు 12 గంటలపాటు ఆలయం మూతపడింది. స్వామి దర్శనానికి వచ్చిన వేలాది మంది భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
విషయం కలెక్టర్‌కు తెలియడంతో ఆయన రంగంలోకి దిగారు. సీసీ టీవీ పుటేజీ పరిశీలించి సదరు పోలీసు తప్పుచేసినట్టు రుజువైతే 24 గంటల్లో చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో పూజారులు శాంతించారు. ఆలయాన్ని తెరిచారు. కాగా, ఆందోళన కారణంగా శుక్రవారం ఉదయం ప్రాత:కాల కైంకర్యం నిలిచిపోయింది. ఇటువంటి దురదృష్టకర పరిస్థితి ఆలయ చరిత్రలో తొలిసారి నెలకొందని పూరీ గజపతి మహారాజ్ రాజా దివ్యసింగ్‌దేవ్ ఆవేదన వ్యక్తం చేశారు.