Telugudesam: టీడీపీ కార్యకర్తలను అడిగితే చంద్రబాబు ఎంత నీతిమంతుడో చెబుతారు!: టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని వ్యంగ్యం
- ఎన్నికల్లో ఖర్చు పెట్టిన వెయ్యి కోట్లు ఎక్కడి నుంచి తెచ్చావు?
- ఎన్నికల్లో పట్టుబడ్డ సొమ్మంతా చంద్రబాబుదే
- ప్రధాని మోదీతో అంటకాగింది నువ్వు కాదా
ఏపీ సీఎం చంద్రబాబుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ఎంత నీతిమంతుడో టీడీపీ కార్యకర్తలను అడిగితే చెబుతారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చుపెట్టిన వెయ్యి కోట్లు ఎక్కడి నుంచి తెచ్చావు? ఎన్నికల్లో పట్టుబడ్డ సొమ్మంతా చంద్రబాబుదే. ప్రధాని మోదీతో అంటకాగింది నువ్వు కాదా? చంద్రబాబుకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చి ఎన్టీఆర్ దగ్గర పార్టీ గుంజుకోలేదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఫెడరల్ ఫ్రంట్, జాతీయ రాజకీయాలపై కేసీఆర్ కు స్పష్టత ఉందని అన్నారు.
చంద్రబాబుకు ఓ పద్ధతి, పాలసీ ఉన్నాయా? అవసరానికి తగ్గట్టుగా రాజకీయాలు చేయడం ఆయనకు అలవాటేనని విమర్శించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతోందని, చూడాలనుకుంటే చంద్రబాబు తెలంగాణకు రావొచ్చని వ్యంగ్యంగా మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఎంత హుందాగా మాట్లాడారో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు.
'మోదీకి, మాకు ఏం సంబంధం ఉంది? నేరుగా మా పార్టీ గురించి, మా ప్రభుత్వం గురించి చంద్రబాబు మాట్లాడాలి' అంటూ హితవు పలికారు. ముందు జగన్ పైన, తర్వాత పవన్ పైన, ఇప్పుడు తమపైన చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని తలసాని దుయ్యబట్టారు. ఏదైనా మంచి జరిగితే తనదిగా, చెడైతే ఎదుటి వారిదిగా చంద్రబాబు మాట్లాడుతారని విమర్శించారు. ‘ప్రత్యేక హోదా సంజీవనా?’ అని ఎవరు ప్రశ్నించారని చంద్రబాబును ఉద్దేశించి ఆయన ఎద్దేవా చేశారు.