Chandrababu: కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పై చంద్రబాబు మరోమారు స్పందన!
- వైసీపీతో కలిసి పని చేస్తామని కేసీఆర్ డైరెక్ట్ గా చెప్పొచ్చుగా?
- ఈ డొంకతిరుగుడు వ్యవహారమెందుకు?
- వైసీపీకి ఇప్పటికే కాంట్రాక్టులు ఇచ్చారు
వైసీపీతో కలిసి పని చేస్తామనో, మద్దతిస్తామనో కేసీఆర్ డైరెక్ట్ గా చెప్పకుండా, రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ ఈ డొంకతిరుగుడు వ్యవహారమెందుకు అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. అయినా, తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటున్న కేసీఆర్, అది ఇప్పటికే వైసీపీ నేతలకు ఇచ్చారని సెటైర్లు విసిరారు. వైసీపీకి ఇప్పటికే కాంట్రాక్టులు ఇచ్చారని, ఇంకా కొన్ని ఇస్తారేమో? అన్నారు నవ్వుతూ.
మోదీ, కేసీఆర్.. వీళ్లిద్దరూ కలిసి దేశాన్ని మోసం చేద్దామనుకున్నారని, మోసం చేయలేకపోతున్నారని, వారికి ఎవరి నుంచీ సపోర్టు రావడం లేదని అన్నారు. ఈ అక్కసుతో తమపై పడిపోతున్నారని, ఇది తప్పు అని హితవు పలికారు. రైతుల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని కేసీఆర్ చెబుతున్నారని, వ్యవసాయ రంగంలో ఈ నాలుగేళ్లలో మీరు సాధించిన అభివృద్ధి కేవలం 0.2 శాతం మాత్రమేనని అన్నారు. ఏపీ 11 శాతం సాధించిన విషయాన్ని గుర్తుచేశారు.