Telangana: బాబోయ్ చలి.. తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలిపులి!
- తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
- ఆదిలాబాద్లో 5 డిగ్రీలు నమోదు
- శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు
తెలంగాణలో చలిపులి ప్రజలను వణికిస్తోంది. పిల్లలు, పెద్దలను ఇబ్బందులకు గురిచేస్తోంది. సాధారణం కన్నా 6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. మరోవైపు ఉత్తర, ఈశాన్య భారత రాష్ట్రాల నుంచి శీతల గాలులు వీస్తుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. పగటి వాతావరణం పొడిగా ఉండడం, రాత్రి వాతావరణం మరీ చల్లగా ఉండడంతో శ్వాస కోశ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నేడు, రేపటి పరిస్థితి కూడా ఇలానే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఆదివారం తెల్లవారుజామున ఆదిలాబాద్లో 5, మెదక్లో 8, రామగుండంలో 8, హన్మకొండలో 10, హైదరాబాద్లో 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నిజానికి హైదరాబాద్లో సాధారణంగా తేమ శాతం 75 శాతం వరకు ఉండాలి. కానీ 51 శాతంగా నమోదైంది. హిమాలయాల నుంచి శీతల పవనాలు వీస్తుండడంతో దేశమంతా ప్రస్తుతం చలి వాతావరణం ఉందని అధికారులు తెలిపారు. గాలిలో తేమ శాతం తగ్గడంతో వాతావరణం పొడిగా ఉంటోంది.