West Godavari District: బాప్రే! జూనియర్ అసిస్టెంట్ ఆస్తులు రూ. వంద కోట్లా?.. ఏలూరులో ఏసీబీకి చిక్కిన అవినీతి ఉద్యోగి
- ఏలూరు పంచాయతీరాజ్ ఉద్యోగి అవినీతి కొండ
- పదుల సంఖ్యలో భవనాలు, అరకిలో బంగారం
- రూ. 5 లక్షల విలువైన రోలెక్స్ వాచీ.. ఇంకా బోలెడు
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎస్పీడీ దివాకర్ ఆస్తులు చూసి ఏసీబీ అధికారులకు కళ్లు బైర్లు కమ్మాయి. అతి సాధారణ ఉద్యోగి అయిన అతడు అనతి కాలంలోనే ఏకంగా వంద కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు సంపాదించాడు. అతడి ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేసిన ఏసీబీ అధికారులు దివాకర్ ఆస్తులు చూసి విస్తుపోయారు. దివాకర్‌తోపాటు ఆయన తల్లి వెంకట సుబ్బలక్ష్మి, సోదరుడు కిరణ్ కుమార్ పేరిట ఉన్న భూములు, ఇతర ఆస్తులను అధికారులు గుర్తించారు.
వీరి పేర్లపై భవనాలు, పదుల సంఖ్యలో స్థలాలు, వ్యవసాయ భూములతో పాటు అరకిలో బంగారం, ఐదు కిలోల వెండి వస్తువులు, రూ. 5 లక్షల నగదు, రూ. 60 వేల విలువైన విదేశీ కరెన్సీ, 5 కార్లు, 2 బైకులు, రూ. 30 లక్షల విలువైన గృహోపకరణాలు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటిలో రూ.5 లక్షల విలువైన రోలెక్స్ వాచీ, ఒక్కోటీ లక్ష రూపాయల విలువైన నాలుగు ఇతర బ్రాండుల వాచీలు ఉన్నట్టు అధికారులు తెలిపారు.