Hyderabad: న్యూ ఇయర్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనదారులు నేడు ఇలా వెళ్లాల్సిందే..!
- బేగంపేట మినహా అన్ని బ్రిడ్జిలపై రాకపోకలు నిషేధం
- పలు ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు
- రాత్రి రెండు గంటల వరకు ట్రావెల్ బస్సులకు నో ఎంట్రీ
హైదరాబాద్‌లో నేటి రాత్రి పది గంటల నుంచి రాత్రి రెండు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నట్టు అదనపు సీపీ (ట్రాఫిక్) అనిల్ కుమార్ తెలిపారు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకే ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు తెలిపారు.
ఒక్క బేగంపేట బ్రిడ్జి మినహా మిగతా అన్ని వంతెనలపైన నేటి రాత్రి రాకపోకలను నిషేధించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు వాహనదారులకు కొన్ని సూచనలు చేశారు. ఖైరతాబాద్ నుంచి నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌వైపు వెళ్లేవారు నేడు ఖైరతాబాద్ చౌరస్తా నుంచి రాజ్‌భవన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపుగా వెళ్లేవారు తెలుగు తల్లి క్రాస్‌రోడ్డు నుంచి ఇక్బాల్ మినార్, లక్డీకాపూల్, అయోధ్య మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లేవారు జీహెచ్ఎంసీ కార్యాలయం, బీఆర్కే భవన్, ఇక్బాల్ మినార్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లేవారు సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ లేన్, లక్డీకాపూల్ మీదుగా గమ్యస్థానాలను చేరుకోవాల్సి ఉంటుంది. ఇక, మింట్ కాంపౌండ్ నుంచి సచివాలయం మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌వైపు వెళ్లే రహదారిపై రాకపోకలు నిషేధించారు. ట్రావెల్ బస్సులు, లారీలు, భారీ వాహనాలను నేటి రాత్రి రెండు గంటల వరకు నిషేధించారు. డ్రంకెన్ డ్రైవ్‌ల కోసం ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నారు.