Bangladesh: బంగ్లాదేశ్ ఎన్నికలు ... బంపర్ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి షేక్ హసీనా!
- మూడోసారి అధికారంలోకి షేక్ హసీనా
- ఘర్షణల్లో 17 మంది మృతి
- భారీ ఎత్తున రిగ్గింగ్ జరిగిందన్న ప్రతిపక్షం
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనా మూడోసారి జయకేతనం ఎగురవేశారు. మొత్తం 298 సీట్లకు జరిగిన ఎన్నికల్లో 287 స్థానాలను సాధించిన హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ పార్టీ అద్వితీయ విజయాన్ని అందుకుంది. 2014 ఎన్నికలను బాయ్‌కాట్ చేసిన ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)కి ఈసారి ఆరు సీట్లు మాత్రమే రావడం గమనార్హం. ఈ ఎన్నికల్లో అవామీ లీగ్ గెలిచినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే, ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
హింసాత్మకంగా మారిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో వివిధ ప్రాంతాల్లో 17 మంది మృతి చెందారు. వీరిలో అధికార అవామీ లీగ్ యూత్ విభాగమైన జుబో లీగ్ జనరల్ సెక్రటరీ మహ్మద్ బషీరుద్దీన్ కూడా ఉన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ఎక్కువ మంది మృతి చెందగా, పోలీసుల కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. చనిపోయిన వారిలో ఎక్కువమంది అధికార పార్టీకి చెందిన కార్యకర్తలే ఉన్నారు.