Telangana: గడ్డకడుతున్న తెలంగాణ.. ఆదిలాబాద్లో వందేళ్ల రికార్డు బద్దలు
- తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
- ఉక్కిరిబిక్కిరి చేస్తున్న శీతల గాలులు
- అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రాన్ని చలి పులి గజగజలాడిస్తోంది. ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోవడంతో ఏళ్లనాటి రికార్డులు బద్దలవుతున్నాయి. ఉత్తర, ఈశాన్య భారతదేశం నుంచి వీస్తున్న చలిగాలులతో తెలంగాణ గడ్డకట్టుకుపోతోంది. గత వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. జిల్లాలోని భీంపూర్ మండలం అర్లి-టి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున 2.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2017 డిసెంబరులో 3.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఈసారి అంతకంటే పడిపోవడం గమనార్హం. మెదక్లో కనిష్టంగా 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
మెదక్లో గత వందేళ్లలో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రత ఇదే. 2017 డిసెంబరులో ఇక్కడ 6.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఇప్పుడు 5.8 డిగ్రీలకు పడిపోయి కొత్త రికార్డు సృష్టించింది. ఇక ఆదిలాబాద్లో3.1, బేలలో 3.4, తలమడుగు, జైనథ్ మండలాల్లో 4.11 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు అన్ని మండలాల్లోనూ 4 కంటే తక్కువ డిగ్రీలే నమోదు కావడంతో ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఉదయం పది గంటలు దాటినా బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.