Cyclone Gaja: గజ తుపాను ఎఫెక్ట్: తమిళనాడుకు రూ.1,146 కోట్ల ఆర్థికసాయం.. ఏపీకి కేంద్రం మొండిచెయ్యి

  • గత నెలలో రూ.353 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
  • తాజాగా మరోమారు..
  • ఏపీ వేడుకున్నా సాయం శూన్యం

ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం మరోమారు శీతకన్ను వేసింది. ఇటీవల సంభవించిన గజ తుపానుతో తీవ్రంగా నష్టపోయిన ఏపీని కాదని, తమిళనాడుకు రూ.1,146 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. జాతీయ ప్రకృతి విపత్తుల సహాయ నిధి కింద ఈ మొత్తాన్ని ప్రకటించారు. గజ తుపాను వల్ల తమిళనాడులోని 10 జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. 46 మంది ప్రాణాలు కోల్పోయారు. నాగపట్నం, తిరువూరు, పుత్తుకొట్టై, తంజావూరు ప్రాంతాల్లో గజ తుపాను తీవ్ర ప్రభావం చూపింది. లక్షలాది ఎకరాల్లో పంట దెబ్బతింది. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. పదుల సంఖ్యలో మరణించారు.

తుపాను సాయం కింద తక్షణం రూ.14,910 కోట్లు సాయంగా ప్రకటించాలంటూ అప్పట్లో తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. గత నెల 3న తమిళనాడుకు తక్షణ సాయం కింద రూ.353 కోట్లు కేటాయించింది. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో తమిళనాడుకు రూ.1,146.12 కోట్ల ఆర్థిక సాయం ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కాగా, గజ తుపాను ఏపీలోనూ విధ్వంసం సృష్టించింది. శ్రీకాకుళంలోని తీర ప్రాంతం దారుణంగా దెబ్బతింది. లక్షలాది ఎకరాల్లో పంట నష్టపోయింది. 50 వేలకు పైగా విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి. ఆర్థిక సాయం ప్రకటించాల్సిందిగా చంద్రబాబు ప్రభుత్వం పలుమార్లు మొత్తుకున్నప్పటికీ కేంద్రం పట్టించుకోలేదు. శ్రీకాకుళంలో తుపాను సహాయ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడే గుంటూరు వచ్చిన హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తుపాను బాధితులను పరామర్శించేందుకు వెళ్లకపోవడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

  • Loading...

More Telugu News