mayavathi: మాయావతి ఒత్తిడికి లొంగిన కాంగ్రెస్.. కేసుల ఉపసంహరణకు నిర్ణయం
- భారత్ బంద్ సందర్భంగా నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలన్న మాయావతి
- లేని పక్షంలో మద్దతుపై పునరాలోచిస్తామంటూ హెచ్చరిక
- కేసులను ఉపసంహరించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుముఖత
గత ఏప్రిల్ లో జరిగిన భారత్ బంద్ సందర్భంగా నమోదు చేసిన కేసులను ఉపసంహరించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. కేసుల ఉపసంహరణకు సిఫారసు చేస్తామని తెలిపింది. మధ్యప్రదేశ్ న్యాయశాఖ మంత్రి పీసీ శర్మ మాట్లాడుతూ, గత 15 ఏళ్లుగా రాజకీయ దురుద్దేశంతో బీజేపీ నమోదు చేసిన కేసులన్నింటినీ ఉపసంహరించనున్నామని వెల్లడించారు.
ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగారుస్తున్నారనే ఆరోపణలతో ఏప్రిల్ 2న భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో, కేసులను ఎత్తివేయాలని మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలను బీఎస్పీ అధినేత్రి మాయావతి కోరారు. కేసులు ఎత్తివేయని పక్షంలో మద్దతు కొనసాగింపుపై పునరాలోచిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, కేసులను ఎత్తివేసేందుకు కమల్ నాథ్ సర్కారు సిద్ధమైంది.