Andhra Pradesh: ఏపీలోనూ అంతే.. మూడు రోజుల్లో రూ.289 కోట్ల విలువైన మద్యాన్ని ఊదేశారు!
- 31న రూ.118 కోట్ల మద్యం విక్రయాలు
- లిక్కర్‌తో పోటీ పడిన బీర్లు
- నిండిన రాష్ట్ర ఖజానా
మామూలుగానే మందుబాబులు రోజూ పండుగ చేసుకుంటారు. అలాంటిది న్యూ ఇయర్ లాంటి ప్రత్యేక సందర్భాల్లో ఊరుకుంటారా? కోట్ల కొద్దీ మద్యాన్ని ఊదేసి ప్రభుత్వ ఖజానాను నింపేశారు. డిసెంబరు 31న తెలంగాణలో రూ. 133 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఏపీలోనూ ఇంచుమించు అదే స్థాయిలో విక్రయాలు జరిగాయి. 31న వంద కోట్ల రూపాయలకు పైగా విలువైన మద్యం విక్రయాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ చెబుతోంది. రాష్ట్రంలో సగటున రోజుకు రూ. 50 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుండగా, డిసెంబరు 29 నుంచి 31 వరకు మొత్తం రూ. 289 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబరు 29న రూ. 103 కోట్లు, 30న రూ. 67 కోట్లు, 31న రూ. 118 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్టు ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
ఈ మూడు రోజుల్లో బీర్ల అమ్మకాలు కూడా లిక్కర్‌తో పోటీపడ్డాయి. డిసెంబరు 29 నుంచి 31 వరకు మొత్తం 4,87,888 కేసుల లిక్కర్ అమ్ముడుపోగా, 3,62,147 కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. వీటితోపాటు ఖరీదైన మద్యం కూడా పెద్ద మొత్తంలో అమ్ముడుపోయినట్టు చెబుతున్నారు.