Sabarimala: ఇంకా మొదలు కాని అయ్యప్ప సంప్రోక్షణ పనులు... పూజారుల వినూత్న నిరసన!
- సన్నిధానం వద్ద తీవ్ర ఆందోళన
- అదనపు బలగాలను రప్పించిన పోలీసులు
- పరిస్థితి అదుపు తప్పకుండా చూస్తున్న అధికారులు
ఈ ఉదయం పోలీసుల భద్రత మధ్య పదునెట్టాంబడి మీదుగా, శబరిమల చేరుకొని, అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించి, స్వామిని దర్శించుకున్న బిందు, కనకదుర్గలు బయటకు వచ్చిన తరువాత, పూజారులు వినూత్న నిరసనకు దిగారు. ఆలయం అపవిత్రమైపోయిందని ఆరోపిస్తూ, గర్భగుడికి తాళాలు వేసిన పూజారులు, ఇంకా సంప్రోక్షణ పనులను ప్రారంభించలేదు.
మరోవైపు ఆలయం వద్ద ఉన్న వేలాది మంది భక్తులు సైతం ఆందోళనకు దిగుతుండటంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సన్నిధానానికి అదనపు బలగాలను రప్పించిన పోలీసు ఉన్నతాధికారులు, పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ఆలయంలోకి మహిళలు ప్రవేశించారన్న వార్త తెలియగానే, నీలక్కల్, పంబ నుంచి సన్నిధానం వరకూ భక్తులు రహదారిపై నిరసనలు తెలుపుతున్నారు.
కాగా, ఈ వార్త దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇప్పటికిప్పుడు అయ్యప్పకు సంప్రోక్షణ జరిపించేందుకు తాము సిద్ధంగా లేమని ప్రధాన తంత్రితో పాటు ఇతర పూజారులు అధికారులకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.