Rafale jet fighters: రాఫెల్ రహస్యాలన్నీ పారికర్ బెడ్రూములోనే ఉన్నాయి.. కాంగ్రెస్ సంచలన ఆరోపణ!
- రాఫెల్ డీల్‌లో అధికార ప్రతిపక్షాల మధ్య ముదురుతున్న యుద్ధం
- రాఫెల్ డీల్ ఫైల్ తన బెడ్రూంలో ఉందన్న పారికర్
- మీడియాకు విడుదల చేసిన కాంగ్రెస్
రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో అధికార బీజేపీ-ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మొదలైన యుద్ధం తార స్థాయికి చేరుకుంది. తాజాగా, రక్షణ శాఖ మాజీ మంత్రి, ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, గోవా మంత్రి విశ్వజిత్ రాణే మధ్య జరిగినదిగా చెబుతున్న సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్‌ను కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా మీడియాకు విడుదల చేసి మరింత కాక రేపారు.
రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన సమాచారం మొత్తం తన బెడ్ రూములోనే ఉందని, ఆ డాక్యుమెంట్లన్నీ తన ఫ్లాట్‌లో భద్రంగా ఉన్నాయని పారికర్ అందులో పేర్కొన్నారని, కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేసేందుకే ఆయన వాటిని తన వద్ద దాచుకున్నారని సూర్జేవాలా ఆరోపించారు. రాఫెల్ ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలన్న తమ డిమాండ్‌కు కేంద్రం అంగీకరించకపోవడం వెనక ఉన్న కారణాల్లో ఇది కూడా ఒకటన్నారు. దీనిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు పారికర్‌కు, తనకు మధ్య జరిగిన సంభాషణగా చెబుతున్న ఆడియో టేప్ నకిలీదని గోవా మంత్రి రాణే పేర్కొన్నారు. తనపై వస్తున్న ఆరోపణలను రాణే ఖండించారు. కాగా, గత వారం గోవా కేబినెట్ సమావేశంలో పారికర్ మాట్లాడుతూ.. రాఫెల్ డీల్‌కు చెందిన మొత్తం డాక్యుమెంట్లు, ఫైలు తన బెడ్రూంలో ఉన్నట్టు కాంగ్రెస్ విడుదల చేసిన ఆడియో టేపులో స్పష్టంగా వినిపిస్తోంది.