Stock Market: భారీ నష్టాలలో ముగిసిన నేటి మార్కెట్లు!
- డిసెంబర్లో పడిపోయిన ఆటో, మెటల్ ఉత్పత్తుల అమ్మకాలు
- సెన్సెక్స్ 363, నిఫ్టీ 117 పాయింట్ల నష్టం
- లాభాల్లో సన్ ఫార్మా, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు
నిన్న నూతన సంవత్సరం రోజున లాభాలతో ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సుమారు ఒక శాతం వరకు మార్కెట్లు నష్టపోయాయి. ఆటో, మెటల్ రంగాలలో డిసెంబర్ నెలలో పడిపోయిన అమ్మకాల డేటా వెలువడడంతో, ఆయా రంగాల స్టాక్స్ ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఉదయం నుంచీ అమ్మకాల ఒత్తిడితో పలు సూచీలు నష్టాలలో ట్రేడ్ అయ్యాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 500 పాయింట్ల వరకు నష్టాల్లో కనిపించింది.
చివర్లో కాస్త తేరుకోవడంతో, పర్యవసానంగా సెన్సెక్స్ 363 పాయింట్ల నష్టంతో 35891 వద్ద, నిఫ్టీ 117 పాయింట్ల నష్టంతో 10792 వద్ద ముగిశాయి. ఇక ఈ రోజు సన్ ఫార్మా, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, భారతీ ఇన్ఫ్రాటెల్ తదితర కంపెనీల షేర్లు లాభపడగా, ఐషర్ మోటార్స్, వేదాంత, టాటా స్టీల్, హిందాల్కో, ఎం&ఎం, టాటా మోటార్స్ తదితర కంపెనీలు నష్టపోయాయి.