Arun Jaitly: డబ్బుకు సంబంధించిన విషయాలను మాత్రం బాగా అర్థం చేసుకుంటారు!: రాహుల్‌పై జైట్లీ ధ్వజం

  • డబ్బు విషయాలను బాగా అర్థం చేసుకుంటారు
  • జాతీయ భద్రతను అర్థం చేసుకోరు
  • కుంభకోణాల్లోని కుట్రదారులు మోదీపై విమర్శలు

రాఫెల్ ఒప్పందంపై లోక్‌సభలో జరుగుతున్న చర్చలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మండిపడ్డారు. ప్రధాని మోదీతోపాటు ప్రభుత్వంపై రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాఫెల్ డీల్‌కు సంబంధించిన పత్రాలు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పడకగదిలో ఉన్నాయంటూ గోవా మంత్రి ఫోన్‌లో మాట్లాడిన టేప్ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అరుణ్ జైట్లీ ధ్వజమెత్తారు. కల్పిత టేప్ అని పారికర్ ఖండించినప్పటికీ.. రాహుల్ అసత్య ఆరోపణలను చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు.

రాఫెల్ ఒప్పందంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని.. కొందరు సహజంగా నిజాలను ఇష్టపడరని జైట్లీ విమర్శించారు. డబ్బుకు సంబంధించిన విషయాలను బాగా అర్థం చేసుకుంటారు కానీ, జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలను మాత్రం అర్థం చేసుకోలేరని జైట్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసు, అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణంతోపాటు.. బోఫోర్స్‌ కుంభకోణంలో దళారిగా వ్యవహరించిన ఖత్రోచీ పేరును ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. రక్షణ కుంభకోణాల్లోని కుట్రదారులు మోదీని విమర్శిస్తున్నారని.. యుద్ధ విమానం గురించి కూడా తెలియని వ్యక్తి కాంగ్రెస్‌కు అధ్యక్షత వహిస్తున్నారంటూ జైట్లీ దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News