Congress: బీహార్‌లో ఆర్జేడీ నేత కాల్చివేత.. అనుమానితుడి 13 ఏళ్ల కుమారుడిని చంపిన మద్దతుదారులు
- ఇందాల్ పాశ్వాన్‌ను కాల్చి చంపిన దుండగులు
- వ్యక్తిగత కక్షలే కారణమన్న పోలీసులు
- నితీశ్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల మండిపాటు
రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) స్థానిక నేత ఇందాల్ పాశ్వాన్ మంగళవారం రాత్రి బీహార్‌లోని నలందాలో దారుణహత్యకు గురయ్యారు. వ్యక్తిగత కారణాలతోనే దుండగులు ఆయనను కాల్చి చంపినట్టు పోలీసులు తెలిపారు. కాగా, పాశ్వాన్ హత్యతో ఆయన మద్దతుదారులు చెలరేగిపోయారు.
పాశ్వాన్ హత్య కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తికి చెందిన 13 ఏళ్ల కుమారుడిని ఇంట్లోంచి లాక్కొచ్చిన ఆందోళనకారులు అతడిని చితకబాదారు. తీవ్ర గాయాలపాలైన బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. డిసెంబరు రెండో వారంలో రెండు రోజుల వ్యవధిలోనే ఇలా అక్కడ ఇద్దరు హత్యకు గురయ్యారు. తాజాగా ఆర్జేడీ నేతను కాల్చి చంపడం సంచలనమైంది.
ఆర్జేడీ నేత హత్యతో కాంగ్రెస్, ఆర్జేడీలు నితీశ్ కుమార్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. రాష్ట్రంలో రోజురోజుకు శాంతిభద్రతలు దిగజారుతున్నాయని ఆరోపించాయి. నిజానికి బీహార్‌లో శాంతి భద్రతలు లేనే లేవని, నేరస్థులు పట్టపగ్గాలు లేకుండా రెచ్చిపోతున్నారని ఆర్జేడీ అధికార ప్రతినిధి భాయ్ వీరేందర్ ఆరోపించారు.