Kerala: అయ్యప్పను మహిళలు దర్శించుకున్న తర్వాత... అట్టుడుకుతున్న కేరళ!

  • కేరళ వ్యాప్తంగా నిరసనలు
  • స్వచ్ఛందంగా షాపులు మూసేసిన వ్యాపార సంస్థలు
  • సచివాలయం వద్ద రాళ్లు రువ్వుకున్న సీపీఎం, బీజేపీ కార్యకర్తలు

నిన్న తెల్లవారుజామున కనకదుర్గ, బిందు అనే మహిళలు శబరిమలకు వచ్చి స్వామిని దర్శించుకున్న తరువాత, కేరళ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. నేడు కేరళ బంద్ కు హిందూ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా షాపులను మూసివేశాయి. పలు ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. బీజేపీ కార్యకర్తలు తిరువనంతపురం సచివాలయం ముందు ర్యాలీ చేపట్టగా, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. సీపీఎం కార్యకర్తలు వారిని అడ్డుకుని రాళ్లు రువ్వారు.

పోలీసులు రంగ ప్రవేశం చేసి వాటర్ క్యానన్ లు, బాష్పవాయు గోళాలను ప్రయోగించి, ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ నిరసనల్లో మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిన్న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న సీపీఎం కార్యాలయాలపై హిందూ సంఘాలు, బీజేపీ నిరసనకారులు దాడులు చేశారు. మలప్పురం ప్రాంతంలో సీఎం పినరయి విజయన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అయ్యప్ప చిత్ర పటాలను చేతిలో పట్టుకున్న ప్రజలు కొచ్చి, పథనంతిట్ట, తిరువనంతపురం, కొల్లాం, కొట్టాయం తదితర ప్రాంతాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు.

కాగా, నేడు బంద్ సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశామని ప్రభుత్వం ప్రకటించింది. శబరిమలలో ఆంక్షలు కొనసాగుతాయని, 144 సెక్షన్ మకరవిళక్కు పూజలు ముగిసేంత వరకూ కొనసాగుతుందని తెలిపాయి. భక్తులు ప్రశాంతంగా స్వామిని దర్శించుకుని వెళ్లాలని ప్రభుత్వం కోరింది.



  • Loading...

More Telugu News