Andhra Pradesh: మోదీగారూ.. మామీద ఎందుకు కక్ష కట్టారు? మేం భారతీయులం కాదా?: దేవినేని ఉమ
- కేసీఆర్ ఫ్యామిలీ పోలవరంపై కేసులు పెట్టింది
- డ్యామ్ ను చూడకుండానే జగన్ విమర్శిస్తున్నారు
- విజయవాడలో మీడియాతో మాట్లాడిన దేవినేని ఉమ
ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టును కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ రెండుసార్లు సందర్శించారని ఏపీ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయనీ, 2019 నాటికి డ్యామ్ నిర్మాణాన్ని పూర్తిచేస్తామని ప్రకటించారు. అప్పటికల్లా గ్రావిటీతో పొలాలకు నీరు ఇస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గడ్కరీ స్వయంగా రాజ్యసభలో చెప్పారన్నారు. కేవలం 414 రోజుల్లో డయాఫ్రం వాల్ కట్టామని మంత్రి అన్నారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో దేవినేని ఉమ మాట్లాడారు.
పోలవరంలో 21.30 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను వినియోగించామని దేవినేని ఉమ తెలిపారు. డ్యామ్ డిజైన్, రివ్యూ కమిటీ, పోలవరం ప్రాజెక్టు అధికారులు నాణ్యత ప్రమాణాలు, పనులపై సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు. ఓ మంత్రిగా పోలవరం డ్యామ్ ను తాను వందలసార్లు సందర్శించానని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు దేశవ్యాప్తంగా అవార్డులు వస్తుంటే ఓ బాధ్యత ఉన్న ప్రధాని మోదీ పోలవరం పనులు సరిగ్గా జరగడం లేదని మాట్లాడారని విమర్శించారు.
‘తెలుగువారు భారతీయులు కాదా? మామీద ఎందుకు కక్ష కట్టారు?’ అని మోదీని ప్రశ్నించారు. పోలవరంపై ఇప్పటికీ కేసులు వేయిస్తున్నారనీ, పోలవరం ఇంజనీర్లు సుప్రీంకోర్టుకు వెళుతున్నారని అన్నారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పోలవరం డ్యామ్ ను కనీసం సందర్శించకుండా పునాదులు కూడా లేవలేదని చెబుతున్నారని విమర్శించారు. దాదాపు 4.50 లక్షల మంది ప్రజలు పోలవరాన్ని ఇప్పటివరకూ సందర్శించారని తెలిపారు. మరోవైపు తెలంగాణ సీఎం కుటుంబ సభ్యులు పోలవరం ప్రాజెక్టుపై కేసులు వేశారని ఆరోపించారు.