Kerala: భక్తులే మహిళలను అయ్యప్ప సన్నిధికి చేర్చారు: పినరయి విజయన్ కీలక వ్యాఖ్యలు
- నిజమైన భక్తులెవరూ అడ్డుకోలేదు
- ఆ సమయంలో బీజేపీ వారు అక్కడ లేరు
- నిరసనలు చేస్తున్నది సంఘ్ పరివార్ మాత్రమే
- మీడియాతో కేరళ సీఎం పినరయి విజయన్
శబరిమలలోని అయ్యప్ప దేవాలయంలోకి మహిళలను అక్కడున్న భక్తులే తీసుకెళ్లారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కనకదుర్గ, బిందులు అయ్యప్పను దర్శించుకున్న తరువాత రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటగా, పినరయి మీడియాతో మాట్లాడారు. "ఇద్దరు మహిళలకు భక్తులే సాయం చేశారు" అని ఆయన అన్నారు.
"నేను అన్ని వీడియోలు చూశాను. మహిళా భక్తులకు ఎక్కడా ఆటంకం కలుగలేదు. వారు నిర్భయంగా, ఆలయం లోపలికి వెళ్లి వెనుదిరిగి వచ్చారు. భక్తుల నుంచి ఎటువంటి నిరసనా ఎదురుకాలేదు. పోలీసు భద్రత కూడా నామమాత్రమే" అని ఆయన అన్నారు. జరుగుతున్న నిరసనలు సంఘ్ పరివార్ పనేనని, మహిళలు, పంబ నుంచి సన్నిధానానికి చేరుకునే క్రమంలో అక్కడ భక్తుల ముసుగులో ఉన్నవి బీజేపీ శక్తులులేవని చెప్పారు.
నిజమైన భక్తులే అక్కడ ఉన్నారని, వారెవరూ వీరిద్దరినీ అడ్డుకోలేదని, సన్నిధానానికి ఎటు వెళ్లాలో దారి చూపారని అన్నారు. శబరిమలకు మహిళల విషయంలో ప్రభుత్వం వద్ద మరో ఆప్షన్ లేదని, సుప్రీంకోర్టు తీర్పును కఠినంగా వ్యవహరించయినా అమలు చేయాల్సిందేనని అన్నారు.