Andhra Pradesh: లోక్ సభలో 14 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్ పై.. తీవ్రంగా స్పందించిన సుజనా చౌదరి!
- రేపు దేశవ్యాప్తంగా ఇదే జరుగుతుంది
- ఇప్పుడే ఎందుకు సస్పెండ్ చేశారు
- పార్లమెంటులో మాట్లాడకుండా చేస్తున్నారని ఆవేదన
ఈరోజు ఆంధ్రప్రదేశ్ కు జరిగినట్లే రేపు దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలకు అన్యాయం జరిగితీరుతుందని టీడీపీ నేత, పార్లమెంటు సభ్యుడు సుజనాచౌదరి హెచ్చరించారు. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీలపై పోరాడుతుంటే ఇన్ని రోజులు చర్యలు తీసుకోకుండా ఇప్పుడు సస్పెండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీని కాదని ముందుకు వెళితే సభలో మాట్లాడకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
లోక్ సభలో ఈ రోజు 14 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెండ్ చేసిన నేపథ్యంలో సుజనా చౌదరి తీవ్రంగా స్పందించారు. లోక్ సభలో ఆందోళనకు దిగడంతో టీడీపీ సభ్యులు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, తోట నరసింహం, మురళీ మోహన్, బుట్టా రేణుక, అవంతి శ్రీనివాస్ , మాగంటి బాబు, జేసీ దివాకర్ రెడ్డి, శ్రీరాం మాల్యాద్రి, అశోక్ గజపతి రాజు, నిమ్మల కిష్టప్ప, పండుల రవీంద్రబాబు, కేశినేని నాని, కొనగళ్ల నారాయణలపై నాలుగు రోజుల పాటు స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు.