Chandrababu: కులం, మతం పేరుతో మోసం చేసేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలి: చంద్రబాబు
- బంగారు గుడ్డును పెట్టే బాతును వదిలొచ్చాం
- ఏపీలో అవినీతి అతి తక్కువ
- ప్రశ్నించిన వారిపై ఐటీ దాడులు
- జగన్ నెత్తిపై సీబీఐ కత్తి
ఇరు రాష్ట్రాలకూ న్యాయం చేయాల్సిన కేంద్రం విభేదాలు సృష్టిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. బంగారు గుడ్డును పెట్టే బాతును తెలంగాణలో వదిలొచ్చామని ఆయన పేర్కొన్నారు. గుంటూరు జిల్లా అచ్చంపేటలో జరిగిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అతి తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రం ఏపీయేనని.. రాఫెల్ డీల్లో అవినీతి చేసిన వాళ్లు తమను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించిన వారిపై ఐటీ దాడులు చేయిస్తున్నారని వాపోయారు. ఐదు రాష్ట్రాల్లో ఓటమిని కూడా మోదీ సమర్థించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మోదీ, కేసీఆర్, జగన్ కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ నెత్తిపై సీబీఐ కత్తి వేలాడుతోందని.. అందుకే ఆయనకు మోదీ అంటే భయమని చంద్రబాబు పేర్కొన్నారు.
కులం, మతం పేరుతో మోసం చేసేవారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. మోదీది మాటల ప్రభుత్వమని.. తమది చేతల ప్రభుత్వమని వివరించారు. దేశంలో రైతులకు రుణమాఫీ ఎక్కడా చేయలేదని చంద్రబాబు పేర్కొన్నారు. చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని.. ఊరంతా కలసి ఒక భూమి ఎవరిదని చెబితే అది వారికే దక్కుతుందని.. దీనికోసం అవసరమైతే చట్టంలో మార్పులు తెస్తామని చంద్రబాబు వెల్లడించారు.