NTR: 'ఎన్టీఆర్'లో బాలకృష్ణ పాత్ర కనిపించదు: చెప్పేసిన కల్యాణ్ రామ్
- తండ్రి హరికృష్ణ పాత్రను పోషించే చాన్స్ రావడం గర్వకారణం
- బాలయ్య పాత్ర కనిపించకపోయినా ఆ లోటు తెలీదు
- అక్కినేని పాత్రలో సుమంత్ అమరిపోయారన్న కల్యాణ్ రామ్
క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ లో ఎన్టీఆర్ నట వారసుడు బాలకృష్ణ పాత్రను పోషించేది ఎవరు? చాలాకాలంగా సస్పెన్స్ లో ఉన్న ఈ విషయంలో అసలు విషయాన్ని చెప్పేశాడు కల్యాణ్ రామ్. మరో ఐదు రోజుల్లో సినిమా విడుదల కానుండగా, సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన కల్యాణ్ రామ్, సినిమాలో అసలు బాలకృష్ణ పాత్ర లేదని అన్నాడు.
'ఎన్టీఆర్'లో చైతన్యరధ సారథి హరికృష్ణ పాత్రను పోషించిన కల్యాణ్ రామ్, తన తండ్రి పాత్రను తాను పోషించే అవకాశం లభించడం తమకెంతో గర్వకారణమని అన్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర కనిపించలేదని అభిమానులు ఒక్క క్షణమైనా ఆలోచించరని, కథకు ఏం కావాలో అదే చూపించి, దాన్నే చిత్రీకరించారని చెప్పాడు.
ఈ చిత్రంలో తన ఫోటో కనిపించినా చాలని భావించానని, అటువంటిది తన తండ్రి పాత్రే దక్కిందని ఆనందాన్ని వ్యక్తం చేసిన కల్యాణ్ రామ్, తన తండ్రి ఆ గెటప్ ను చూసివున్నా బాగుండేదని, ఇప్పుడాయన మన మధ్య లేకపోయారని అన్నాడు. ఇక సినిమాలో బాబాయ్ (బాలకృష్ణ) తరువాత చక్కగా కుదిరిన పాత్ర సుమంత్ దేనని, ఆయన అక్కినేని నాగేశ్వరరావుగా చక్కగా కుదిరారని, ఆపై చంద్రబాబు పాత్రలో రానా కూడా బాగున్నారని చెప్పాడు.