Telangana: 'తెలంగాణలో కలిపేయాలి' అంటూ రోడ్డెక్కిన మహారాష్ట్ర గ్రామాల ప్రజలు!
- ఆందోళనకు దిగిన 40 గ్రామాల సర్పంచ్ లు
- నాయకత్వం వహించిన బీజేపీ, శివసేన స్థానిక నేతలు
- తెలంగాణ పథకాలపై ఏర్పడ్డ ఆకర్షణతోనే
తమను తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలంటూ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు. సుమారు 40 గ్రామాల సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు ధర్మాబాద్ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ నిరసనలకు బీజేపీ, శివసేన నాయకులు నేతృత్వం వహించడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వ పథకాలపై ఈ ప్రాంత ప్రజలకు ఆకర్షణ ఏర్పడటమే ఇందుకు కారణం.
ఉదాహరణకు... తెలంగాణకు చెందిన అమ్మాయికి, మహారాష్ట్ర సరిహద్దు గ్రామంలోని అబ్బాయికి వివాహం చేయగా, కల్యాణలక్ష్మి కింద లక్ష రూపాయలు అందాయి. ఈ విషయం తెలుసుకున్న అక్కడి వారు ఆశ్చర్యపోయారు. ఇక మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఉన్న కొందరు రైతులకు తెలంగాణలో భూములుండగా, వాటికి రైతుబంధు, రైతు బీమా పథకాలను కేసీఆర్ సర్కార్ వర్తింపజేస్తోంది. పైగా వీరందరూ 24 గంటలూ ఉచిత కరెంటును అనుభవిస్తున్నారు.
మహారాష్ట్రలో ఇటువంటి పథకాలు లేకపోవడంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలంటూ నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గ సరిహద్దులో ఉన్న ధర్మాబాద్ సమితి ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగారు. తమ గ్రామాల్లో మౌలిక వసతులు లేవని, తమ నిరసనల గురించి తెలుసుకున్న ప్రజా ప్రతినిధులు, సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి వెళ్లడం మినహా మరేమీ చేయడం లేదని వాపోయారు.