Andhra Pradesh: ఏపీలో ప్రతీ పథకంలోనూ అవినీతే.. అన్న క్యాంటీన్ లో ఒక్కో ప్లేటుపై రూ.27 కొట్టేస్తున్నారు!: ఉండవల్లి
- రూ.600 ఎల్ఈడీ బల్బు రూ.6 వేలకు అమ్ముతున్నారు
- ఆదరణ, మొబైల్ ఫోన్లలో భారీ అవినీతి
- విశాఖ మీడియా సమావేశంలో ఉండవల్లి వ్యాఖ్య
చంద్రబాబు ప్రభుత్వం ఆదరణ పథకం కింద అందించిన వాషింగ్ మెషీన్లతో పాటు ఎల్ఈడీ లైట్లు, అన్న క్యాంటీన్లు సహా అవినీతి లేని పథకం ఒక్కటీ లేదని పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. ఒక్కో ఎల్ఈడీ బల్బు రూ.600 ఉంటే ప్రజలకు రూ.6000కు అమ్మారని దుయ్యబట్టారు.
ఈ భారం ప్రజలకు కనిపించకుండా పదేళ్ల పాటు నెలకు రూ.45 కట్టాలని రూల్ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్ఏల కు రూ.7 వేల విలువైన ఫోన్ అప్పగించి రూ.12,000 వసూలు చేస్తున్నారని అన్నారు. ఇంత విచ్చలవిడిగా అవినీతికి పాల్పడాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఉండవల్లి మాట్లాడారు.
అన్న క్యాంటీన్ ఒక్కో ప్లేటుపై రూ.27 కొట్టేస్తున్నారని ఉండవల్లి ఆరోపించారు. రేపు చంద్రబాబు నెగ్గితే ‘అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉండే ప్రభుత్వ ఆస్తులు అన్నీ స్థానిక ఎమ్మెల్యే అధీనంలోకి వెళతాయి’ అని తీర్మానం చేసినా చేయొచ్చని వ్యాఖ్యానించారు. ఈ కేబినెట్ నిర్ణయాలపై చట్టపరంగా మాత్రమే సవాలు చేయొచ్చనీ, అవినీతి ఆరోపణలు చేయలేమని స్పష్టం చేశారు. ఏపీలో జరుగుతున్న అవినీతిపై చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని ఉండవల్లి ప్రశ్నించారు.