Andhra Pradesh: ప్రతిపక్షంగా వైసీపీ ఫెయిల్.. ఏపీలో అవినీతి చేయకుంటే ప్రజలు ఓట్లు వేయరు!: ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు
- అసెంబ్లీని బాయ్ కాట్ చేయడం సరికాదు
- కేరళలో అవినీతి కనిపించదు
- విశాఖలో మీడియా సమావేశంలో ఉండవల్లి
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష వైసీపీ విఫలం అయిందని పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. అసలు అసెంబ్లీని బాయ్ కాట్ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిపై వ్యక్తిగతంగా అవినీతి ఆరోపణలు లేవని తెలిపారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
పైఅధికారులు నీతిగా ఉంటే కిందిస్థాయి ఉద్యోగులు నిజాయతీగా పనిచేస్తారని ఉండవల్లి అన్నారు. కేరళకు వెళితే అక్కడ అవినీతి అనేదే ఉండదనీ, కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా పారదర్శక పాలన ఉంటుందని తెలిపారు. అలా ఉంటేనే కేరళ ప్రజలు నాయకులకు ఎన్నికల్లో ఓటు వేస్తారని చెప్పారు.
కానీ ఏపీలోమాత్రం అవినీతి చేయకుంటే ఓటు వేయరని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఇక్కడ ప్రజల నుంచే అవినీతి మొదలయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ అవినీతి జరిగిందనీ, అయితే చంద్రబాబు హయాంలో జరిగినంత దారుణంగా అయితే లేదని స్పష్టం చేశారు.