paruchuri: సరైన క్లైమాక్స్ లేని సినిమా .. సున్నం ఎక్కువైన కిళ్లీలాంటిది: పరుచూరి గోపాలకృష్ణ
- ఎప్పుడూ లూజ్ క్లైమాక్స్ చెప్పకూడదు
- ఆయన చెప్పిన మాట అది
- ఒక మంచి విషయం నేర్చుకున్నాం
'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, ఒక కథను ఒక గంటలో చెప్పవలసి వస్తే ఏయే అంశాలను ప్రధానంగా తీసుకోవాలనే విషయాన్ని ఆయన చెప్పారు. అలాగే సినిమాకి క్లైమాక్స్ ఎంత ప్రధానమనే విషయాన్ని గురించి ఆయన ప్రస్తావిస్తూ .."లూజ్ క్లైమాక్స్ .. మామూలు క్లైమాక్స్ చెబితే అవతలవాళ్లు 'ఇంతేనా' అనుకునే అవకాశం వుంది. అందువలన అసలైన క్లైమాక్స్ దొరికేవరకూ ఆ విషయాన్ని చెప్పకూడదు.
మేము 'కలియుగ మహాభారతం' రాస్తున్నప్పుడు దర్శకుడు హనుమాన్ ప్రసాద్ గారు మాకు ఒక మంచి మాట చెప్పారు. 'సినిమా అంతా పంచభక్ష్య పరమాన్నాలయితే, క్లైమాక్స్ కిళ్లీలాంటిది' అని అన్నారాయన. సున్నం ఎక్కువైతే కిళ్లీ ఎలా ఉమ్మేస్తారో, అలాగే క్లైమాక్స్ గనుక బాగోలేకపోతే అసంతృప్తితో బయటికి వెళ్లిపోతారు' అని అన్నారు. సున్నం ఎక్కువైన కిళ్లీ ఎలాంటిదో .. సరైన క్లైమాక్స్ లేని సినిమా అలాంటిదన్న మాట. ఇంతమంచి విషయాన్ని ఆయన దగ్గర మేము నేర్చుకున్నాము" అని చెప్పుకొచ్చారు.