mim: అసదుద్దీన్ పై అనుచిత వ్యాఖ్యల కేసు.. దిగ్విజయ్ కు హైకోర్టులో ఊరట!
- డబ్బు కోసమే ఒవైసీ ఎన్నికల్లో పోటీ చేస్తారన్న డిగ్గీ
- ఈ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు
- డిగ్గీపై నాన్ బెయిలబుల్ వారెంట్ ను సస్పెండ్ చేసిన హైకోర్టు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు ఊరట లభించింది. దిగ్విజయ్ పై నాంపల్లి కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది.
తనపై జారీ చేసిన వారెంట్ ను ఎత్తివేయాలని కోరుతూ హైకోర్టును దిగ్విజయ్ ఆశ్రయించారు. ఈ వారెంట్ ను ఎత్తివేయడంతో పాటు దీనిని అమలు చేయొద్దని పోలీసులను కూడా హైకోర్టు ఆదేశించింది. కాగా, డబ్బు కోసమే అసదుద్దీన్ వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేస్తారని దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ ఎంఐఎం జనరల్ సెక్రటరీ హుస్సేన్ అన్వర్ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలోనే దిగ్విజయ్ కు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం జరిగింది.